కన్నుల పండుగగా అయ్యప్ప మహా పడిపూజ జాతర మహోత్సవం..
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్27:
కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప గుట్టపై వెలసిన అయ్యప్ప 18 మెట్ల మహా పడిపూజ జాతర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రతి ఏటా డిసెంబర్ 27వ తేదీన నిర్వహించే ఈ అయ్యప్ప మహా పడిపూజ జాతర మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ జాతర మహోత్సవానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరవగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోరుట్ల మాజీ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ ఈ మహా జాతర పడిపూజ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. ఉదయం నుండి కోరుట్ల నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుండి భక్తులు అయ్యప్ప దర్శనానికి బార్లు తీరారు అయ్యప్ప శరణు ఘోషతో దీక్షపరులు చేసిన భజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ జాతర మహోత్సవం సందర్భంగా మెట్పల్లి డిఎస్పి రాములు, కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, ప్రవీణ్ సబ్ ఇన్స్పెక్టర్ లు శ్రీకాంత్, రామచంద్రం ల నేతృత్వంలో భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల పట్టణ అధికారులు రాజకీయ ప్రముఖులు మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.