31 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే భద్రగిరి ముస్తాబైంది. ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. కరకట్ట, రామాలయ పరిసరాలు, సూపర్‌బజారు సెంటరు, బ్రిడ్జి పాయింట్‌లో భక్తులకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి నుంచి ఆలయం రాత్రి సమయాల్లో విద్యుత్తు అలంకరణ మధ్య భద్రాద్రి దేవస్థానం మిరిమిట్లు గొలుపుతోంది.
గోదావరి తీరంలో ఆలయ అధికారులు హంస వాహనాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం నుంచి జనవరి 8 వరకు ప్రతి రోజూ ఒక అలంకారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 9న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం, 10న ఉత్తరద్వారం దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు. పర్ణశాల రామాలయం కూడా ముక్కోటి వేడుకలకు ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలోల భాగంగా మొదటి రోజు మంగళవారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.