కిడ్నీలు ఫెయిల్ అయిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్త పడండి..!
మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల వల్ల మన శరీరంలో వ్యర్థాలు, టాక్సిన్లు పేరుకుపోకుండా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే చాలా మందికి ప్రస్తుతం కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. పొగ తాగడం, మద్యం సేవించడం, డయాబెటిస్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఉప్పును అధికంగా తినడం వంటి కారణాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. అయితే కిడ్నీలు ఫెయిల్ అయితే ప్రారంభంలోనే మన శరరీం మనకు కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గమనిస్తే కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని అర్థం చేసుకోవచ్చు. ఇక కిడ్నీలు డ్యామేజ్ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరసం, అలసట..
కిడ్నీలు ఫెయిల్ అయితే కనిపించే మొదటి లక్షణం నీరసం, అలసట. కిడ్నీలు ఫెయిడ్ అయితే శరీరంలోని వ్యర్థాలు సరిగ్గా బయటకు పోవు. దీంతో అవి శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా శరీర కణాలకు ఆక్సిజన్, గ్లూకోజ్ లభించడం కష్టమవుతుంది. దీంతో మనం ఆహారం తీసుకున్నప్పటికీ నీరసంగా, అలసటగా ఉంటుంది. పనిచేయలేకపోతాం. ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే మీ కిడ్నీలు పాడయ్యాయని అర్థం చేసుకోవాలి. వెంటనే అలర్ట్ అయి డాక్టర్‌కు చూపించుకోవాలి. అలాగే కిడ్నీలు ఫెయిల్ అయితే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట మరిన్ని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. దీంతో నిద్రకు ఆటంకం ఏర్పడి నిద్రలేమి సమస్య వస్తుంది. మీకు కూడా ఇలాగే అవుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి.
చర్మంపై ప్రభావం..
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో చర్మంపై కూడా ప్రభావం పడుతుంది. చర్మం దురద పెడుతుంది. కొందరికి దద్దుర్లు కూడా వస్తుంటాయి. అలాగే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని అర్థం చేసుకోవాలి. కొందరికి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. ఇలాంటి స్థితి గనక ఉంటే కిడ్నీలు పాడై చాలా రోజులు అయిందని అర్థం. ఇలాంటి లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కిడ్నీలు డ్యామేజ్ అయిన వారికి మూత్రంలో నురుగు వస్తుంటుంది. ఇలా ఉన్నా కూడా అనుమానించాల్సిందే.
శరీరంలో నీరు..
కిడ్నీలు పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి కళ్ల చుట్టూ వాపులు వస్తాయి. తరచూ ఈ లక్షణం కనిపిస్తుంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయేమో చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా కిడ్నీలు పాడైన వారిలో శరీరంలో నీరు చేరుతుంది. దీంతో పాదాలు, ముఖ్యంగా మడమల వద్ద వాపులు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో వేలితో నొక్కితే సొట్టపడి చర్మం లోపలికిపోతుంది. ఇలా అవుతున్నా కూడా కిడ్నీలు డేంజర్‌లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే జాగ్రత్త పడితే కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దీంతో ప్రాణాంతకం కాకుండా ముందే ఆపవచ్చు.