భోగి మంటలు ఎందుకు వేస్తారు? దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా?
సంక్రాంతి పండగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది. ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెడతారు. మరి భోగి మంటలు ఎందుకు వేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా?
శాస్త్రీయ కారణాలివే..
సంక్రాంతి సమయంలో సూర్యడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు. ఆధ్యాత్మిక విషయానికొస్తే దక్షిణయానంలో పడిన కష్టాలను తొలగించి, సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతుంటారు. భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. వామన అవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు. దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని.. సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట. అందుకే సంక్రాంతి ముందు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఆరోగ్యపరంగా..
భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతుంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. భోగి రోజు వేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మజీవులు నశిస్తాయి. భోగి మంటలు పెద్దగా రావడానికి రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తుంటారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72వేల నాడులు ఉత్తేజితం అవుతాయి. అందుకే భోగి రోజున భోగి మంటల్లో అందరూ పాల్గొనే సంప్రదాయం వచ్చిందని అంటారు.
వీటిని కాల్చొద్దు
భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలని చెబుతుంటారు. దీంతో చాలామంది ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ వేస్తుంటారు. మంటలు ఎక్కువగా రావాలని కొంతమంది టైర్లు, రబ్బర్, ప్లాస్టిక్ కవర్లు కాలుస్తుంటారు. ఔషధ మొక్కలకు బదులు ఇలాంటి వస్తువులను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ఈ మంటల నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భోగి మంటల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులను కాల్చొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
About The Author


Related Posts

