తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి మందా జగన్నాథం : కేటీఆర్
హైదరాబాద్ : మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మంద జగన్నాథం పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. ఆయన పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నాలుగు సార్లు ఎంపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. వివాదరహితుడు, సౌమ్యుడైన మందా జగన్నాథం.. తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కాంక్షించిన వ్యక్తి జగన్నాథం అని కేటీఆర్ కొనియాడారు.
గత కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో జగన్నాథం బాధపడుతున్నారు. గత నెల 22న ఊపిరితిత్తుల సమస్య రావడంతో కుటుంబసభ్యులు నిమ్స్‌లో చేర్చారు. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో ఆయనను ఆర్‌ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రాగా, వెంటనే అత్యవసర వైద్య చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. రాత్రి 7.40గంటలకు మృతిచెందినట్టు నిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.
About The Author


Related Posts

