బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..
హైదరాబాద్: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈనేపథ్యంలో గురువారం ఉదయం నోటీసులు ఇచ్చేందుకు మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని మాసబ్‌ట్యాంక్ పీఎస్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేస్తున్నదని విమర్శించారు. ప్రశ్నించిన వారిని కాంగ్రెస్ సర్కార్ వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 14 ఏండ్లపాటు ఉద్యమంలో పాల్గొన్నానని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశానని చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంటి డోర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఎన్నికేసులు పెట్టినా, ఎంత నిర్బంధం విధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.