ఈ క్రైస్తవ బిడ్డలు ఏం పాపం చేశారు.. రేవంత్ రెడ్డి గారూ..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు అందరూ సిద్ధమయ్యారు. చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు కూడా క్రిస్మస్ పండుగకు హాలీడేస్ ఇచ్చాయి. కానీ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలకు సీఎం రేవంత్ రెడ్డి సెలవులు ప్రకటించలేదు. సెలవులు ఇవ్వకపోవడంతో గురుకులాల్లో చదువుతున్న క్రిస్టియన్ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
ఈ క్రైస్తవ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారూ..? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. అందరి పిల్లల లాగా వీళ్లకు కూడా పండగ పూట వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడిపే అవకాశం ఉండాలె కదా? మీ రాహుల్ గాంధీ చెప్తున్న లౌకితత్వం అంతా ఉట్టిదేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా 3 రోజులు క్రిస్మస్ సెలవులి వ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది సెలవులను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని సొసైటీలో ప్రతి సంవత్సరం 24,25,26న సెలవులు ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. విద్యార్థులను ఇళ్లకు పంపకపోవడంతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగుతున్నారు. తమకు అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, దానికి కూడా విద్యార్థులను పంపకపోతే ఎలా అని మండిపడుతున్నారు.