స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05:
స్త్రీ ప్రకృతిని నడిపించే పంచ శక్తులకు మూలమని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ అన్నారు. కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 'అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం'లో భాగంగా శనివారం బ్రహ్మవైవర్త పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. పంచభూతాలు ఏ విధంగా సృష్టిని నడిపిస్తున్నాయో, ఆ పంచ శక్తులను ఇచ్చేటువంటి మాతృశక్తి స్త్రీ మూర్తిలోనే దాగుందన్నారు. భగవంతుడు మూల ప్రకృతిని 5 శక్తులుగా విభజించి పంచ మాతృకలుగా సృష్టించాడన్నారు. ప్రపంచంలో స్త్రీని శక్తి స్వరూపినిగా గౌరవించి, ఆరాధించే సంస్కృతి కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. 'యత్ర నార్యాంతు పూజ్యంతే, తత్ర రమంతి దేవతాః' అనే ఆర్యోక్తి ఆధారంగా సనాతన భారత ధర్మం ప్రతి కాలంలో స్త్రీని గౌరవించిదన్నారు. మానవ జీవన వికాసానికి స్త్రీమూర్తే ఆధారమని, కుటుంబం సక్రమంగా నడవాలంటే స్త్రీ మూర్తి మార్గమని మహేశ్వరశర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు డాక్టర్ వేముల ప్రభాకర్, వనపర్తి చంద్రం, భోగ శ్రీధర్, మంచాల రాజలింగం, దొంతుల సుందరవరదరాజన్, వడ్నాల రామారావు, భానుమూర్తి, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.