ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని
హైద్రాబాద్లో వరుసభేటీలతో ఎమ్మెల్యే బిజీ బిజీ
కార్పొరేషన్, విమానాశ్రయం ఏర్పాటు నా చిరకాల వాంఛ కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.
కొత్తగూడెం టౌన్ పాల్వంచ పట్టణాలు, సుజాతనగర్ మండలంలోని కొన్నిగ్రామాలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడటంతో అందుకు కృషి చేసిన కొత్తగుడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హుటాహుటిన హైద్రాబాద్ వెళ్లిన కూనంనేని మంత్రులతో వరుసబెట్టి అయ్యారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు వల్లే సాధ్యమని గుర్తించి ఏడాదికాలంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పించి కార్పొరేషన్ సాధించడం జరిగిందని, ఇది కొత్తగూడెం నియోజకవర్గం మరింత అభివృద్ధి సాదించేందుకు దోహదపడుతుందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు కూనంనేని కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గంలో త్వరలో విమానాశ్రయం :
గరీబీపేట కేంద్రంగా త్వరలో విమానాశ్రయం ఏర్పాటుకు జరగబోతోందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. విమానాశ్రయం స్థలం సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీకి రూ.38 లక్షలు మంజూరు చేసిందని కూనంనేని తెలిపారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రేత్యక దృష్టి సారించి ఆనతికాలం ఎయిర్పోర్ట్ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెనుకడుగువేసేది లేదన్నారు, అనునిత్యం శ్రమించి ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు.