అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
అగ్రరాజ్యం అమెరికా లో ఇటీవలే వరుసగా భారతీయ విద్యార్థుల మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాల కోసం యూఎస్ వెళ్లిన పలువురు విద్యార్థులు అక్కడ జరిగిన ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన 25 ఏళ్ల బండి వంశీ గతేడాది జులైలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నెసొటాలో పార్ట్‌టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చదువుతున్నాడు. అయితే, అతడు ఆదివారం తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కారులో శవమై కనిపించాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హన్మకొండ జిల్లాకు చెందిన యువకులు ఆదివారం ఉదయం వంశీ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వంశీ మృతితో మాదన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.