అసెంబ్లీలో ఫార్ములా రేస్‌పై చర్చకు బీఆర్‌ఎస్ పట్టు.. సభను వాయిదా వేసిన స్పీకర్
హైదరాబాద్: కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని చెప్పారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్ చాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్ నిర్ణయం తీసుకున్నామన్నారు.
తాము తప్పు చేశామంటున్నారని, సభలో చర్చించి అదేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేసింది ఎందుకు తప్పుకాదో ఈ సభ ద్వారా మేం కూడా ప్రజలకు చెబుతాం. మీరు పెట్టింది అక్రమ కేసు కాకుంటే ఈ సభలో చర్చించాలన్నారు. తాము తప్పు చేయలేదని.. రాష్ట్రం కోసం చేశామని కేటీఆర్ చెప్పారన్నారు. అక్రమ కేసు పెట్టినప్పుడు కేటీఆర్‌కు చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలపై నిలదీస్తున్నందుకు, లగచర్ల రైతుల తరఫున పోరాటం చేస్తున్నందుకు కేటీఆర్‌పై కేసు పెట్టారని విమర్శించారు. ఈ క్రమంలో సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఫార్ములా-ఈ రేస్ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. అది ఒక సభ్యుడికి సంబంధించ అంశమని, ముందు బిల్లులపై చర్చిద్దామని స్పీకర్ అన్నారు. అందుకు ఒప్పుకోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫార్ములా-ఈ కార్ రేస్‌పై చర్చకు పట్టుపట్టారు. భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చను ప్రారంభించడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు.