మన్మోహన్ పాత్రను రిజెక్ట్ చేయాలనుకున్నా : అనుపమ్ ఖేర్
భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌సింగ్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు సంతాపం వ్యక్తంచేశారు. తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ కూడా మన్మోహన్ గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించాడు. ఈ క్రమంలోనే మన్మోహన్‌సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో మన్మోహన్ పాత్రలో నటించాడు అనుపమ్ ఖేర్.
మన్మోహన్ సింగ్ చాలా తెలివైన వ్యక్తి. ఎంతో నిజాయతీపరుడు, గొప్ప నాయకుడు. ఆయనను కలిసే అవకాశం నాకు రెండు సార్లు వచ్చింది. అయితే ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో నేను మన్మోహన్ పాత్రలో నటించాను. మొదట ఈ సినిమా కోసం చిత్రబృందం నన్ను సంప్రదించినప్పుడు నేను ఒప్పుకోలేదు. నా పర్సనల్ కారణాలతో పాటు రాజకీయ ఒత్తిడులకు తలవంచి ఈ ప్రాజెక్ట్‌ను వదిలేద్దమనుకున్నాను. కానీ ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రలో నటించే అవకాశం అందరికి రాదని ఈ సినిమాను అంగీకరించాను. నేను చేసిన గొప్ప సినిమాల్లో ఇదోకటి. ఆ చిత్రం వివాదాస్పదం అయ్యి ఉండవచ్చు.. కానీ ఆయన మాత్రం వివాదాలు లేనివాడు అంటూ అనుపమ్ చెప్పుకోచ్చాడు.
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ సినిమాకు విజయ్ గుట్టే దర్శకత్వం వహించగా.. సంజయ్ బారు రచించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే నవళ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. 2019లో విడుదలైన ఈ చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కోంది. మన్మోహన్ సింగ్ కూడా ఈ సినిమాపై స్పందిస్తూ.. ఇందులో చెప్పినవన్ని అబద్దాలు అంటు చెప్పుకోచ్చాడు.