ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
ప్రైవేటు టీచర్స్ ఫోరంరాష్ట్ర కమిటీ
అక్షరగెలుపు :సోమాజిగూడ : నిన్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లు ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిల్ అయిన వారు, ప్రభుత్వ ఉపాధ్యాయుల అర్హత లో సగం అర్హత లేని వాళ్ళు, ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్నారని ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల ప్రవేట్ టీచర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యలు ఉండటం బాధాకరం. అన్ని అర్హతలు ఉండి గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రాక, ఉపాధ్యాయ వృత్తిపై ఉన్నటువంటి ఫ్యాషన్ తో, చాలీచాలని జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ సెలవు దినాలలో కూడా పనిచేస్తూ రాష్ట్ర విద్యాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించకపోగా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరుస్తూ మాట్లాడడం తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ముక్తకంఠంతో ఖండిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రజా ప్రభుత్వం అవమానించడం బాధాకరం. ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తూ, కనీస వేతనాలు అమలు లేకపోవడం, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేకపోవడం, హెల్త్ కార్డు లాంటి కనీస సౌకర్యాలు లేకున్నా, ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు నోచుకోకుండా, కనీసం ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి సన్మానం నోచుకోకుండా తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధికి శ్రమిస్తూ, తనకు తాను కొవ్వెత్తిలా కరిగిపోతూ తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధి జ్యోతిని నిరంతరం వెలిగిస్తున్న ప్రైవేట్ టీచర్ల పట్ల చిన్న చూపుతో, అవహేళన చేస్తూ మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రవేట్ టీచర్ల బతుకులపై ఆలోచన చేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులను మరియు ప్రైవేటు ఉపాధ్యాయులను వేరువేరుగా చూస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయండి..? మీరు మాట్లాడిన వేదిక పైన ఉన్నటువంటి నాయకుల పిల్లలు, వారి మనవళ్ళు మనవరాలు... అదేవిధంగా మీ ముందు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలందరూ చదువుతున్నది ప్రవేట్ పాఠశాలల్లో కాదా అని ఈ సందర్భంగా గుర్తుచేదల్చుకున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులను దగ్గర తీసుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి గారికి తగునా అని ప్రశ్నిస్తున్నాం. అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందంటే దాని కారణం ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల చిత్తశుద్ధి అన్న విషయం మర్చిపోవద్దు. 8 వేల జీతం తీసుకుంటున్న ప్రైవేటు ఉపాధ్యాయుడు దగ్గరికి వచ్చి 80 వేల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లవాడి యొక్క చదువు గురించి మాట్లాడుతున్న విషయం వాస్తవం కాదా..? ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన టెట్ పరీక్షలో సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈరోజు ప్రైవేట్ రంగంలో ఎనిమిది వేల నుండి 80 లక్షల వరకు జీతాలు తీసుకునేటువంటి టీచర్లు కూడా ఉన్నారు. కనీసం ప్రభుత్వం ద్వారా ప్రవేట్ టీచర్లకు గుర్తింపు కార్డు కూడా లేకుండా కట్టు బానిసలు లాగా ప్రైవేట్ యాజమాన్యాల వద్ద పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడడం ప్రైవేట్ టీచర్ల యొక్క మనసులు బాధించబడ్డాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలను పరిష్కరించి మాకు అండగా నిలవల్సిందిగా ప్రార్థిస్తున్నాము.