పెద్దచెరువులో భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్ మృతదేహం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్ మతదేహం లభించింది. ఇప్పటికే అదే చెరువులో బీబీపేట పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. ఎస్‌ఐతోపాటు శృతి, నిఖిల్ బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. వారి వస్తువులు సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున కనిపించడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభించగా, గురువారం ఉదయం ఎస్‌ఐ మృతదేహం కూడా దొరికింది.
భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ సెల్‌ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ఆఫ్ వస్తుండటంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. ఇదే క్రమంలో బీబీపేట పీఎస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి.. విధులు ముగిసినా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లారు. చెరువుకట్టపై ఎస్‌ఐ సొంత కారులో ఫోన్లు, చెప్పులు లభ్యమయ్యాయి.
వాటి ఆధారంగా ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌గా గుర్తించారు. కాగా, వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా అనే విషయం పోస్టుమార్టం అనంతరం తెలుస్తుందని జిల్లా ఎస్పీ సింధూశర్మ అన్నారు. వారి మృతికిగల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. అయిఏ గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి, బదిలీపై భిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పని చేసిన సమయంలో వీరికి పరిచయం ఏర్పడిందని భావిస్తున్నారు.