అచ్చొచ్చిన మెల్‌బోర్న్ స్టేడియంలో విరాట్ కోహ్లీ రాణించేనా..? సచిన్, రహానే రికార్డులను బ్రేక్ చేసేనా..?
ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మొదలుకానున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు ముగిశాయి. ప్రస్తుతం టీమిండియా, ఆసిస్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించగా.. ఒక టెస్టు డ్రాగా ముగింది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇరుజట్లు మెల్‌బోర్న్ టెస్ట్‌కు సిద్ధమవుతున్నాయి. చివరిసారిగా మెల్‌బోర్న్ మైదానంలో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి.. పాక్‌పై భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.
టీ20 ప్రపంచకప్‌లో విజయాన్ని అందించిన విరాట్
మెల్‌బోర్న్ స్టేడియంలో విరాట్ భారత్‌కు అద్వితీయమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ రెండేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి భారత్‌కు అసాధ్యమైన విజయాన్ని అందించాడు. అప్పుడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో విరాట్ మరోసారి వీరవిహారం చేసి విమర్శకులకు ధీటుగా సమాధానమిచ్చాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భిన్నమైన ఫార్మాట్‌లో విరాట్ ఎంసీజీలో మ్యాచ్ ఆడబోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌లో పెర్త్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మిగతా ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతనకు అచ్చొచ్చిన మైదానం విరాట్ బ్యాట్‌తో విమర్శలకు బదులిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
మెల్‌బోర్న్‌లో విరాట్‌కు పాపులారిటీ..
మెల్‌బోర్న్‌లో విరాట్‌కు మంచి పాపులారిటీ ఉన్నది. టూర్ గైడ్‌ల నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు విరాట్ పేరును జపిస్తుంటారు. ఎంసీజీలోని ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ మ్యూజియం టికెట్ కౌంటర్ వద్దకు చేరుకోగానే.. అందరికీ విరాట్ ఫొటోలు కనిపిస్తాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 2018-19లో తొలిసారిగా సిరీస్ గెలిచిన తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముద్దాడిన కోహ్లీ.. ఎంసీజీలో జరిగిన మూడో టెస్టులో జట్టుతో కలిసి సంబరాలు చేసుకుంటున్న చిత్రాలు అక్కడ ఉన్నాయి. పలువురు అభిమానులు అతని ఆటను చూసేందుకు వస్తుంటారు. పెర్త్‌లో నివాసం ఉంటున్న గుజరాత్‌కు చెందిన సలోని అనే మహిళ.. క్రిస్మస్ సెలవుల్లో మెల్‌బోర్న్‌లో టెస్ట్ చూసేందుకు వస్తుంటానని చెప్పింది. తొలిసారిగా మెల్‌బోర్న్‌లో విరాట్ సెంచరీ చేయడం సంతోషంగా అనిపించిందని.. విరాట్ దూకుడు అంటే తనకు ఇష్టమని చెప్పింది. మైదానంలో అతన్ని చూడడం సరదాగా ఉంటుందని.. అతని ఫిట్‌నెస్‌కు సాటిలేదని తెలిపింది.
2011లో కోహ్లీ తొలి బాక్సింగ్ డే టెస్టు ఆడిన విరాట్
విరాట్ తొలిసారిగా 2011లో బాక్సింగ్ డే టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చి.. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేశాడు. రెండు క్యాచులు సైతం పట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత 2014లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 169 పరుగులు చేశాడు. అజింక్యా రహానేతో కలిసి 262 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించాడు.
చివరిసారిగా 2018లో మెల్‌బోర్న్‌లో టెస్ట్..
2018లో ఆస్ట్రేలియాలో చివరిసారిగా కోహ్లి బాక్సింగ్ డే టెస్టు ఆడగా.. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో కెప్టెన్ కోహ్లీ ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసినా రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేకపోయాడు. బుమ్రా తొమ్మిది వికెట్లు కూల్చి భారత్ విజయానికి బాటలు వేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 2-1 ఆధిక్యంలోకి వచ్చేలా చేశాడు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మైదానమైన ఎంసీజీలో కోహ్లీ 52.66 సగటుతో మూడు టెస్టుల్లో 316 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున ఎంసీజీలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (10 మ్యాచ్‌లలో 449 పరుగులు) చేశాడు. రహానే (ఆరు మ్యాచ్‌ల్లో 369 పరుగులు) పరుగులు చేయగా.. సచిన్ కంటే విరాట్ 133 పరుగులు, రహానే కంటే 53 పరుగులు వెనుకపడ్డాడు.
టీమిండియాకు కలిసొచ్చిన మైదానం
టెస్టుల్లో కోహ్లితో పాటు భారత జట్టుకు ఎంసీజీ కలిసివచ్చిన స్టేడియం. 1978లో ఈ మైదానంలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారిగా 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. భగవత్ చంద్రశేఖర్ ఆ మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టాడు. కోహ్లి కెప్టెన్సీలో 2018-19లో తొలిసారిగా ఆస్ట్రేలియాలో భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.