ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. భారత్ – పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత్ జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాను పాక్‌కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దాంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టింది. మొదట ఇందుకు నిరాకరించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత దిగివచ్చింది. భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌ని సైతం హైబ్రిడ్ మోడల్‌లోనే ఆడుతామని షరతు విధించింది. దీనికి ఐసీసీతో పాటు బీసీసీఐ అంగీకరించడంతో ట్రోఫీపై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో.. భారత్ తన మ్యాచులన్నీ యూఏఈలో ఆడనున్నది. చాంపియన్స్ ట్రోఫీకి యూఏఈని ‘తటస్థ వేదిక పీసీబీ అధికార ప్రతినిధి అమీర్ మీర్ పేర్కొన్నారు.
పాక్‌తో టీమిండియా సమరం ఎప్పుడు..?
చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 19న కరాచీలో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. అలాగే, 27న రావల్పండిలో బంగ్లాదేశ్‌తో తలపడుతున్నది. ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన భారత్-పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న ఆదివారం జరుగనున్నది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ని ఐసీసీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పాక్ బోర్డు సిద్ధం చేసి ఐసీసీకి పంపింది. హైబ్రిడ్ మోడల్ నేపథ్యంలో షెడ్యూల్‌ను సవరించి.. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు న్యూజిలాండ్ ఉన్నది. భారత్ గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో మ్యాచులన్నీ యూఏఈ వేదికగా జరుగుతాయి. 20న బంగ్లాదేశ్‌తో, న్యూజిలాండ్‌తో మార్చి 2న తలపడనున్నట్లు సమాచారం. ఇక గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా మ్యాచులు మినహా గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికగా జరుగుతాయి.
సమాచారం మేరకు.. రెండు సెమీఫైనల్స్ మార్చి 4వ, 5వ తేదీల్లో జరుగనున్నాయి. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. ఫైనల్‌కు రిజర్వ్‌డే ఉంటుంది. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరితే దుబాయిలోనే ఆడుతుంది. లేకపోతే పాక్‌లోని లాహోర్‌లో మ్యాచ్ జరుగుతుంది. అలాగే, టీమిండియా ఫైనల్‌కు చేరినా దుబయి వేదికగానే జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచులు జరుగుతాయని ఐసీసీ గురువారం ప్రకటించింది. ఐసీసీ టోర్నమెంట్‌ల సమయంలో ఒక దేశం.. మరో దేశంలో పర్యటించదు. రెండు తటస్థ వేదికల్లోనే తలపడుతాయి. 2024-27 వరకు వరకు ఇదే నిబంధన అమలులో ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.