కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌కు నోటీసులు.. 7 రోజుల్లో స్పందన లేకపోతే చట్టపరమైన చర్యలు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి చెందిన ఓ పబ్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు లోని ఎమ్‌జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక అధికారులు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలోని ఎమ్‌జీ రోడ్డులో గల రత్నం కాంప్లెక్స్‌లో ఆరవ అంతస్తులో ఉన్న ఈ రెస్టారెంట్ అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సహా ఎలాంటి అనుమతులూ లేకుండానే నిర్వహిస్తున్నారని సామాజిక కార్యకర్త వెంటకేష్ బెంగళూరు సివిల్ బాడీ కి ఫిర్యాదు చేశారు. ఫైర్ సేఫ్టీ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన బీబీఎంసీ అధికారులు.. ఆ ఫిర్యాదు నిజమేనని తేల్చారు. ఈ మేరకు నవంబర్ 29న కోహ్లీకి చెందిన ఆ పబ్‌కు నోటీసులు జారీ చేశారు.
అయితే, పబ్ యాజమాన్యం నోటీసులకు స్పందించకపోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. దీంతో అధికారులు కోహ్లీ పబ్‌పై మరోసారి చర్యలకు పూనుకున్నారు. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్‌వోసీని సమర్పించాలని ఆదేశించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ ఏడాది జులైలో కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి అర్ధరాత్రి 1:30 గంటల వరకూ తెరిచి ఉంచడాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.