తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్ కల్యాణ్ రిక్వెస్ట్
తెలంగాణలో సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షూటింగ్‌లకు ఏపీకి రావాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షో ప్రదర్శనను చూసేందుకు హీరో అల్లుఅర్జున్ అక్కడికి వచ్చిన రాగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శనివారం పలు వ్యాఖ్యలు చేశారు.
11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని.. బాధిత కుటుంబాన్ని హీరో, నిర్మాత పరామర్శించలేదని ఆరోపించారు. ఒక్క రోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే.. సినిమావారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని.. టాలీవుడ్ ప్రముఖులపై మండిపడ్డారు. ప్రజల రక్షణ తమ బాధ్యత అంటూనే బాధ్యతరహితంగా ప్రవర్తించే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదంటూ సినీ ఇండస్ట్రీని ఘాటుగానే హెచ్చరించారు.
కాగా ఏపీలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్‌కల్యాణ్ సినీ రంగంపై మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో చాలా సుందరమైన ప్రదేశాలున్నాయని, సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్‌లు చేయాలని సూచించారు. విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలు గిరిజన, పల్లె ప్రాంతాల్లోనూ ఉంటాయని తెలిపారు. ఇటువంటి స్థలాల్లో షూటింగ్‌లు చేస్తే గిరిజనులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.