ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. వారంలో నాలుగోసారి
దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకుబాంబు బెదిరింపులురావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి.
మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్, నార్త్ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపులు రావటం వారంలో ఇది నాలుగోసారి. గత శుక్రవారం ఏకంగా 40 పాఠశాలలకు, శనివారం మరో ఆరు పాఠశాలలకు, అంతకు ముందు నగరంలోని పలు పాఠశాలలు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో తాను చదువుకుంటున్న స్కూల్‌కు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపినందుకు ఓ విద్యార్థిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థికి కౌన్సెలింగ్ నిర్వహించి, అతడి తల్లిదండ్రులను హెచ్చరించారు. వరుస బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాంబు బెదిరింపులపై ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే స్పందించారు. నగరంలో నెలకొన్న శాంతిభద్రతలపై ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని, ఢిల్లీ నేరాలకు రాజధానిగా మారిందని విమర్శించారు.