ఇక గంటలోపే తిరుమల శ్రీవారి దర్శనం.. టీటీడీ సరికొత్త ప్లాన్ రెడీ!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు చాలా ఈజీగా మారనుంది. క్యూలైన్‌లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం చేసుకుని బయటకు వచ్చేయొచ్చు. శ్రీవారి దర్శనాన్ని మరింత సౌలభ్యం చేసేందుకు బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో టీటీడీ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దర్శనాలు పూర్తి చేసేలా కార్యచరణను టీటీడీ అధికారులు రూపొందించారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శ్రీవారి దర్శనానికి గురువారం నుంచే ప్రయోగాత్మకంగా అమలు చేయడం ప్రారంభించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వారం రోజుల పాటు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ఈ నెల 24వ తేదీన జరగబోయే పాలక మండలిలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు పేర్కొన్నారు.
ఏఐ టెక్నాలజీతో దర్శనం ఎలా అంటే..
గంటలోపే దర్శనం చేయించడానికి మొదటగా భక్తుల ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందిస్తారు. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్‌లో స్కానింగ్ అనంతరం క్యూ లైన్‌లోకి పంపుతారు. గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది.
ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఏఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే క్యూలైన్లను మెయింటైన్ చేయడమే కాకుండా, వీఐపీలను ఎంతగా నియంత్రిస్తే అంతగా భక్తులకు సరైన సేవలు అందే అవకాశం ఉందని బీఆర్ నాయుడు ట్విట్టర్(ఎక్స్) వేదికగా అభిప్రాయపడ్డారు.