తెలుగు తమ్ముళ్లకు సారీ చెప్పిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి!
ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో కలిసి పార్థసారథి పాల్గొన్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా మంత్రి చేష్టలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగారు పడిపోయిన కొలుసు పార్థసారథి ఇప్పటికే చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు శాంతించకపోవడంతో తాజాగా అమరావతిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ వారికి సారీ చెప్పారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఇచ్చిన గౌరవాన్ని తాను ఎప్పటికీ మరిచిపోనని మంత్రి పార్థసారథి తెలిపారు. గౌడ సామాజిక వర్గం వాళ్లు డిజైన్ చేసిన ప్రొగ్రామ్‌కు తాను వెళ్లానని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అక్కడ సడెన్‌గా జోగి రమేశ్‌ను చూసి షాకయ్యానని పేర్కొన్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చొరబడటం వైసీపీ నేతలకు ముందు నుంచి అలవాటేనని చెప్పారు. జోగి రమేశ్‌కు చిల్లర చేష్టలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
వైసీపీ తానులో నుంచి చించుకుని బయటకు వచ్చేశానని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. తాను టీడీపీ సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు తనను ఆదరించారని.. నూజివీడులో తమ భుజం మీద వేసుకుని మరీ తనను గెలిపించారని చెప్పారు. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని కాదని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా జోగి రమేశ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. జోగి రమేశ్ ఎపిసోడ్‌లో పార్టీ హైకమాండ్, కార్యకర్తలకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.