సీఎం రేవంత్‌కు జ్ఞానోదయం కల్పించాలి.. అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్‌ఎస్ వినతి పత్రాలు.. ఫొటోలు
హైదరాబాద్: లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను సీఎం రేవంత్ రెడ్డి కాలరాశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలన్నారు. లగచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి విలాసవంతమైన టూర్లలో పాల్గొంటున్నారని విమర్శించారు. గిరిజన రైతులకు బెయిల్ రాకుండా కోర్డులో అడ్డుకుంటున్నారని, ఛాతీనొప్పి వచ్చినా చేతులకు బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేవరకు బీఆర్‌ఎస్ నాయకులు వెంటపడి నిలదీస్తామన్నారు.