నేను ఏ రోడ్ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అన్నారు. అంతా మంచి జరగాలని అనుకున్నానని.. అనుకోని ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎవరి తప్పు లేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. హాస్పటల్‌లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని.. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి తాను చాలా బాధపడుతున్నానన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నానన్నారు.
శ్రీ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తాను ఎవరినీ దూషించదలచుకోలేదని చెప్పారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా..? నేను ఎవరినైనా ఏమైనా అంటానా? అని ప్రశ్నించారు. ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిషన్ కమ్యూనికేషన్ జరుగుతోందన్నారు. ఈ ఘటన విషయంలో నా క్యారెక్టర్‌ను కించపరిచారని వాపోయారు. థియేటర్ తనకు దేవాలయం లాంటిదని.. అక్కడ ప్రమాదం జరగడం బాధగానే ఉందన్నారు. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఎలాంటి రోడ్‌షో, ఎలాంటి ఊరేగింపు చేయలేదన్నారు. తాను తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు సినిమా చేస్తే.. తన క్యారెకట్లర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు.
మూడేళ్లు కష్టపడ్డానని.. థియేటర్‌లోనే చూస్తేను తెలుస్తుందన్నారు. సంధ్య థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని.. ఊరేగింపు చేయలేదన్నారు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయిందని.. తాను కనిపిస్తేనే జనం జరుగుతారని భావించి తాను కారు నుంచి బయటకు వచ్చానన్నారు. ఫ్యాన్స్‌కు తాను చెబితేనే వింటారని.. అందుకే బయటకు వచ్చి అందరిని వెళ్లమని చెప్పినట్లు వివరించారు. థియేటర్‌లో తాను సినిమా చూస్తున్న సమయంలో తనను ఏ పోలీస్ కలువలేదని స్పష్టం చేశారు. తాను మేనేజర్ చెబితే మాత్రమే థియేటర్ నుంచి వెళ్లిపోయానన్నారు. కానీ, అక్కడ ఏం జరిగిందో తెలియదని.. ఆ తర్వాత రోజు మాత్రమే తనకు తెలిసిందన్నారు. తనకు పిల్లలు ఉన్నారని.. మహిళ చనిపోయిన ఘటన తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను? అని ప్రశ్నించారు.
థియేటర్ వద్ద రేవతి మృతి విషయం.. బాబు ఆరోగ్య పరిస్థితి మరుసటి రోజు తెలిస్తే వెంటనే బన్నీ వాసును పంపించానన్నారు. తాను కూడా వస్తానని చెప్పానని.. కానీ అప్పటికే నా మీద అప్పటికే వాళ్లు కేసు ఫైల్ చేశారని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ వెళ్తామని ముందుకు వచ్చినా లీగల్ టీమ్ వద్దని చెప్పిందన్నారు. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులను పరామర్శించేందుకు చాలా దూరమే వెళ్లాలని.. తన అభిమానులు చనిపోతే వెళ్లకుండా ఉంటానా? అని ప్రశ్నించారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఇంకా షాక్‌లోనే ఉన్నానని.. అందుకే ఆలస్యంగా వీడియో పెట్టానన్నారు. డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదన్నారు. సినిమాకు సంబంధించి చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నామని.. ఈ ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశామన్నారు.
ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పానన్నారు. అదీ కుదరదని అన్నారని.. కుదిరితే సుకుమార్‌గారిని వెళ్లమని. అదీ కుదరలేదన్నారు. తాను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అందరూ ఆరోపిస్తున్నారని.. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారన్నారు. ఇది మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నారన్నారు. థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయాలని నేను సినిమాలు చేస్తున్నానని.. ఈ ఘటన విషయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పెద్ద అమౌంట్ ఫిక్స్‌డ్ చేయాలని అనుకున్నామన్నారు. అవసరమైతే ఫిజియో థెరపీ చేయించాలని అనుకున్నామన్నారు. తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటుంటే.. మనల్ని మనం కిందకు లాక్కుంటున్నామన్నారు.
తాను ఎవరినీ నిందించడానికి మీడియా సమావేశం పెట్టలేదని.. సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించిందన్నారు. అందుకు ధన్యవాదాలు చెబుతున్నానని.. కానీ, తనపై తప్పుడు సమాచారం చేస్తున్నారన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని.. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారని.. అందుకు తనకు ఎంతో బాధగా ఉందన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవని.. నాకు మానవత్వం లేదనడం ఏమాత్రం సరికాదన్నారు. తనపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధమేనన్నారు. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఉన్నందున మీడియా ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం చెబుతానన్నారు.
మా కుటుంబం గురించి తెలుసు : అల్లు అరవింద్
అనంతరం అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ వెళ్లిపోయారని.. తాను చేసిన పాన్ ఇండియా మూవీని థియేటర్‌లో చూసుకుందామనే వెళ్లాడన్నారు. థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత మా ఇంట్లో పార్కులోని ఓ మూలన కూర్చొని అదే ఆలోచనలో ఉన్నాడన్నారు. పలువురు సక్సెస్ సెలబ్రేషన్ చేస్తామని చెబుతున్నారని.. అయినా ఎక్కడికీ వెళ్లడం లేదని తెలిపారు. ఓ అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధలో ఉన్నాడని.. 22 సంవత్సరాలు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడని తెలిపారు.
ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్‌మీట్‌లో రాలేదని తెలిపారు. మూడు తరాలుగా మా కుటుంబం గురించి తెలుసని.. ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా? మీ కళ్ల నుంచి తప్పించుకుని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే, బాధగా ఉందని అరవింద్ పేర్కొన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని.. ప్రజలు ఆదరిస్తే పైకి వచ్చిన కుటుంబమని.. ఆ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నామన్నారు.