8 సార్లు పల్టీలు కొట్టిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
జైపూర్: హైవేపై వేగంగా వెళ్లిన కారు అదుపుతప్పింది. రోడ్డుపై 8 సార్లు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులకు చిన్నగాయమైనా కాలేదు. పైగా అక్కడున్న వారిని టీ అడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం కొందరు వ్యక్తులు నాగౌర్ నుంచి బికనీర్ వెళ్లేందుకు ఎస్‌యూవీలో ప్రయాణించారు. అయితే హైవేపై వేగంగా వెళ్తున్న ఆ కారు ఒక మలుపు వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ స్టీరింగ్‌పై కంట్రోల్ తప్పడంతో ఆ కారు రోడ్డుపై ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. రహదారి పక్కన ఉన్న కారు షోరూమ్ గేట్‌ను బలంగా ఢీకొట్టి ఆగింది.
కాగా, కారు పల్టీలు కొడుతుండగా డ్రైవర్ కిందకు దూకేశాడు. కారులోని మిగతా నలుగురు వ్యక్తులు ప్రమాదం తర్వాత కిందకు దిగారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ కూడా చిన్న గాయమైనా కాలేదు. ఈ సంఘటన తర్వాత కారు షోరూమ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తులు తమకు టీ ఇవ్వాలని అడిగినట్లు అక్కడున్న ఆ ఏజెన్సీ అధికారి తెలిపారు. కారు ఎనిమిది సార్లు పల్టీలు కొట్టినప్పటికీ అందులో ప్రయాణించిన వ్యక్తులు అద్భుతంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.