నితీష్ రెడ్డి సెంచరీ.. ఫ్యామిలీతో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ.!
బోర్డర్ – గవాస్కర్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను తన బ్యాటింగ్‌తో ఫాలో ఆన్ నుంచి బయటపడేయడమే కాకుండా.. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేశాడు. టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ కొట్టడమే కాకుండా.. ఈ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నితీశ్ రెడ్డి సెంచరీ కొట్టినప్పుడు ఆయన తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదిలావుంటే.. తొలి టెస్టు సెంచరీతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన నితీష్ రెడ్డిని తన ఫ్యామిలీ తాజాగా కలుసుకుంది. మ్యాచ్ అనంతరం నితీష్ ఉన్న హోటల్‌కి వచ్చిన అతడి కుటుంబం నితీష్‌ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. నితీష్ తండ్రి కూడా ఆనందంతో అతడిని గట్టిగా ఆళింగనం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నితీష్ తండ్రి తెలుగులో మాట్లాడుతూ.. ఈరోజు నితీష్ చాలా బాగా ఆడాడు. ఒక తండ్రిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు ఇండియా తరపున ఆడాలని అతడి కళ ఈరోజు నేరవేరింది. నితీష్ చెల్లి తేజస్వీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ప్రయాణం అయితే కాదు. నేను ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా.. అతడు చెప్పాడు.. అతడు చేసి చూపించాడు అంటూ తేజస్వీ చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.