పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ప్రియాంక గాంధీ.. బీజేపీ ఎలా స్పందించిందంటే?
న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) సోమవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు వంటివి ఆ బ్యాగ్‌పై ఉన్నాయి. ప్రియాంక గాంధీ పార్లమెంటు ఆవరణలోఈ బ్యాగ్‌తో దిగిన ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రియాంక గాంధీ తీసుకెళ్లిన ప్రత్యేక బ్యాగ్ పాలస్తీనాకు ఆమె మద్దతు, సంఘీభావాన్ని చూపుతోంది. కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు సంజ్ఞ. జెనీవా ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని ఆమె స్పష్టం చేశారు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, గత ఏడాది అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గళమెత్తారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో ‘జాతి హత్య’లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీరును కూడా ఆమె నిందించారు. గత వారం ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ అబేద్ ఎల్రాజెగ్ అబు జాజర్‌ను కూడా ఆమె కలిశారు.
మరోవైపు ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో కనిపించడంపై బీజేపీ స్పందించింది. ‘గాంధీ కుటుంబం ఎప్పుడూ బుజ్జగింపుల సంచిని మోస్తుంది. ఎన్నికల్లో వారి ఓటమికి బుజ్జగింపుల సంచే కారణం’ అని బీజేపీ నేత సంబిత్ పాత్ర విమర్శించారు.
బీజేపీ ఎంపీ గులాం అలీ ఖతానా కూడా దీనిపై స్పందించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారని విమర్శించారు. ‘ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పుడు, వారు అలాంటి చర్యలను ఆశ్రయిస్తారు’ అని మీడియాతో అన్నారు.