మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ముర్ము నివాళి
ఆర్థిక సంస్కరణల రూపకర్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. మన్మోహన్ నివాసానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. అక్కడ మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కూడా మన్మోహన్‌కు నివాళులర్పించారు.
గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలువురు నేతలు మన్మోహన్‌కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.