రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన కుర్‌కురే.. 10 మందికి గాయాలు.. అరెస్ట్ భయంతో పరార్
రూ.5 రూపాయల కుర్‌కురే కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో గాయపడగా.. అరెస్ట్ భయంతో కొందరు గ్రామం నుంచి పరారయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా హొన్నెబాగి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మొదలైన ఈ గొడవ రెండు రోజుల వరకూ కొనసాగింది. గ్రామానికి చెందిన అతీఫ్ ఉల్లా కుటుంబం స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటుంది. వారి దుకాణానికి దగ్గర్లోనే రోడ్డు పక్కన సద్దాం కుటుంబం హోటల్ నడుపుతుంటారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సద్దాం కుటుంబానికి చెందిన చిన్న పిల్లలు.. అతీఫ్ దుకాణంలో కుర్‌కురే ప్యాకెట్ కొనుగోలు చేశారు. అయితే, గడువు దాటిన కుర్‌కురే అమ్మారంటూ సద్దాం కుటుంబం అతీఫ్ కుటుంబంతో గొడవకు దిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
ఇరు వర్గాలు కొట్టుకునే వరకూ వెళ్లారు. రెండు వాహనాల్లో వచ్చిన సుమారు 30 మంది దుకాణంలోకి ప్రవేశించి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ గొడవలో సుమారు 10 మంది గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అరెస్ట్ భయంతో సుమారు 25 మంది వరకూ గ్రామం విడిచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.