వారికి ఓ విజన్ లేదు.. సీఎం అభ్యర్థి లేరు.. బీజేపీ విమర్శలకు కేజ్రీవాల్ కౌంటర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అరోప్ పత్ర పేరిట ఆప్ ప్రభుత్వంపై బీజేపీ రెండు రోజుల క్రితం తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వమని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. ఈ మేరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదని.. తనను ఎలా వేధించాలో మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ‘ఈ ఎన్నికల కోసం బీజేపీకి ఎలాంటి అజెండా లేదు. ఇంత వరకూ సీఎం అభ్యర్థి కూడా లేరు. వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
కాగా, ఆప్ ప్రభుత్వంపై అరోప్ పత్ర పేరుతో బీజేపీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వం. అందరికీ ఉచిత నీరు అని చెప్పారు. నేడు ప్రజలు ట్యాంకర్లకు వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఢిల్లీని కాలుష్య రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. చివరికి వాళ్ల మంత్రులే కటకటాల పాలయ్యారు’ అని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
‘కేజ్రీవాల్‌జీ.. మీరు తరచుగా నంబర్ 1 అని చెబుతుంటారు. మీరు ఎందులో నంబర్ 1..? దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని మీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నంబర్ 1. దేశంలోనే అత్యంత అవినీతిపరులైన మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు’ అంటూ కేజ్రీవాల్‌పై అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.