రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేస్తే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఉదయం నిద్ర లేచేందుకు బద్దకం వహిస్తుంటారు. దీంతో సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్తుంటారు. కానీ వ్యాయామం ఉదయం చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుందని వారు అంటున్నారు. ఇక ఉదయం పరగడుపునే రన్నింగ్ చేయడం వల్ల అద్భుతమైన లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. పరగడుపునే రన్నింగ్ చేస్తే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని, అలాగే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని వారు చెబుతున్నారు.
కొవ్వు వేగంగా కరుగుతుంది..
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు మరింత వేగంగా కరుగుతుంది. కండరాలు, ఇతర ప్రదేశాలలో ఉండే గ్లూకోజ్ నిల్వలు త్వరగా ఖర్చవుతాయి. దీంతో శరీరం శక్తి కోసం కొవ్వు మీద ఆధారపడుతుంది. కనుక ఉదయం కాస్త సేపు రన్నింగ్ చేసినా చాలు ఎక్కువ మొత్తంలో కొవ్వు కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. త్వరగా బరువు తగ్గాలని చూస్తున్నవారు ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేస్తే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత సులభంగా గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు రోజూ రన్నింగ్ చేస్తే డయాబెటిస్‌ను వెనక్కి మళ్లించే చాన్స్ ఉంటుందని అంటున్నారు.
కండరాల దృఢత్వం..
ఇక ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల కండరాలు సైతం దృఢంగా మారుతాయి. దీంతో కండరాలు మరింత శక్తిని వినియోగించుకుంటాయి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం తగ్గుతుంది. నీరసం, అలసట ఉండవు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్ గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట అనిపించదు. కొందరికి శరీరంలో ఎంత ప్రయత్నించినా కరగని మొండి కొవ్వు ఉంటుంది. అది సైతం ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల కరిగిపోతుంది. దీంతో త్వరగా బరువు తగ్గవచ్చు.
మానసిక ఆరోగ్యానికి..
ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. చక్కగా నిద్ర పడుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేస్తే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. ఇది స్త్రీ, పురుషుల్లో సంతానం కలిగే అవకాశాలను పెంచుతుంది. సంతానం కోసం చూస్తున్న దంపతులు ఉదయం రన్నింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సైంటిస్టులు సైతం చెబుతున్నారు. ఇలా రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.