చలికాలంలో రోజూ ఆకుకూరలను తింటే ఎన్నో లాభాలు..!
చలికాలంలో మనకు అనేక రకాల సీజనల్ పండ్లు, కూరగాయలు లభిస్తుంటాయి. అలాగే ఆకుకూరలు కూడా ఈ సీజన్‌లో మనకు విరివిగా లభ్యమవుతుంటాయి. కనుక సీజన్‌లో లభించే వాటిని తినాలి. ముఖ్యంగా తరచూ ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, గోంగూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు ప్రస్తుతం మార్కెట్‌లోకి ఎక్కువగా వస్తాయి. కనుక ఆకుకూరలను కచ్చితంగా తినాల్సి ఉంటుంది. వీటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఆకుకూరలను తింటే ఈ సీజన్‌లో మనకు వచ్చే వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అలాగే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి పోషకాలు సైతం అందుతాయి. చలికాలంలో ఆకుకూరలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పాలకూర, మెంతి ఆకులు..
పాలకూర గురించి అందరికీ తెలుసు. అయితే చలికాలంలో మనకు ఇది ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. పాలకూరను సూప్‌లు, సలాడ్స్ లేదా ఇతర కూరల్లోనూ వేసి తినవచ్చు. లేదా పనీర్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో ఎంతో లాభం ఉంటుంది. అలాగే మెంతి ఆకులు కూడా మనకు ఈ సీజన్‌లో ఎక్కువగానే లభిస్తాయి. మెంతి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులతో మనం తరచూ పప్పు లేదా పచ్చడి చేస్తుంటాం. మెంతి ఆకులను తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మెంతి ఆకులతో పరాఠాలను తయారు చేసి తినవచ్చు. లేదా ఇతర కూరల్లోనూ ఈ ఆకులను వేసి తినవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
తోటకూర..
తోటకూర మనకు మార్కెట్‌లో రెండు రకాల రంగుల్లో లభిస్తుంది. ఆకుపచ్చ, ఊదా రంగుల్లో ఉండే తోటకూర మనకు అందుబాటులో ఉంటుంది. తోటకూరలో ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తోటకూరను ఈ సీజన్‌లో తినడం వల్ల శరీరాన్ని సైతం వెచ్చగా ఉంచుకోవచ్చు. తోటకూరను నేరుగా కూర చేసి తినవచ్చు. లేదా ఇతర కూరగాయలతోనూ వండుకోవచ్చు. తోటకూరతో పప్పు చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ముల్లంగి ఆకు..
సాధారణంగా చాలా మంది ముల్లంగిని ఆహారంలో భాగంగా తింటారు. కానీ ముల్లంగి ఆకులను కూడా మనం తినవచ్చు. వీటితోనూ కూరలు చేసుకోవచ్చు. ముల్లంగి ఆకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముల్లంగి ఆకులను కూడా వివిధ రకాల కూరగాయలతో కలిపి వండి తినవచ్చు. అలాగే గోంగూరను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో పచ్చడి, పప్పు చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే చుక్క కూరను కూడా తినవచ్చు. ఇందులోనూ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగాల నుంచి రక్షిస్తాయి. ఇలా పలు ఆకుకూరలను చలికాలంలో తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.