ఉదయం లేవగానే మడమలు నొప్పిగా ఉంటున్నాయా..? అయితే ఇలా చేయండి..!
చాలా మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలి మడమలు లేదా పాదాలు నొప్పిగా ఉంటాయి. కొందరికి ఈ నొప్పులు చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నొప్పులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ పలు సూచనలు పాటిస్తే ఈ నొప్పులను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందుకు గాను ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. పలు సహజసిద్ధమైన పద్ధతుల్లోనే కాలి మడమలు లేదా పాదాల నొప్పులను తగ్గించుకోవచ్చు. అందుకు పాటించాల్సిన సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాదాలు లేదా మడమల నొప్పి వచ్చేందుకు ఒక ప్రధాన కారణం ఉంటుంది. అదేమిటంటే.. కాలి వేళ్లను, మడమలను కలిపే కణజాలం ఒత్తిడికి గురైనా లేదా ఎక్కువగా సాగినా కూడా ఈ నొప్పి అనేది వస్తుంది.
అనేక కారణాలు..
పాదాలపై పదే పదే ఒత్తిడిని కలగజేస్తే ఈ విధంగా కణజాలం సాగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ సేపు నిలబడడం, మరీ ఎక్కువగా వాకింగ్ లేదా రన్నింగ్, జాగింగ్ వంటివి చేయడం, సరైన షూస్ లేదా చెప్పులను ధరించకపోవడం వల్ల పాదాలపై, మడమలపై ఒత్తిడి పడుతుంది. దీంతో అక్కడ ఉండే కణజాలం వాపులకు గురవుతుంది. సాగుతుంది. దీని వల్ల పాదాలు లేదా మడమల్లో నొప్పులు వస్తాయి. అలాగే హై హీల్స్ ఉన్న చెప్పులను ధరించడం, అధిక బరువు ఉండడం వల్ల కూడా ఈ నొప్పులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
విశ్రాంతి అవసరం..
అయితే ఈ నొప్పులు ఉన్నవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. పాదాలు లేదా మడమల నొప్పులు పూర్తిగా తగ్గే వరకు విశ్రాంతి అవసరం. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీంతో నొప్పులు మరీ ఎక్కువవుతాయి. అప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. నడవడం కూడా కష్టంగా ఉంటుంది. కనుక ఈ తరహా నొప్పులు ఉన్నవారు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. పాదాలకు విశ్రాంతిని ఇవ్వాలి. తేలికపాటి నడక అయినా సరే వద్దు. అలా చేయడం కూడా మంచిది కాదు. పూర్తిగా విశ్రాంతిని ఇవ్వాలి. దీంతో త్వరగా నొప్పుల నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది.
ఆవనూనెతో మసాజ్..
మార్కెట్‌లో పాదాలను సున్నితంగా ఉంచే పాదరక్షలు లేదా షూస్ లభిస్తున్నాయి. వాటిని ధరించాలి. దీంతో పాదాలపై భారం పడకుండా ఆపవచ్చు. దీని వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. అలాగే కాస్త ఆవనూనెను వేడి చేసి రాత్రి పూట పాదాలకు మర్దనా చేయాలి. దీంతో ఎంతగానో రిలీఫ్ లభిస్తుంది. మరుసటి రోజు ఉదయం వరకు నొప్పులు తగ్గిపోతాయి. ఇలా పూర్తిగా కోలుకునే వరకు చేయాలి. నొప్పులను తగ్గించడంలో ఆవనూనె ఎంతగానో పనిచేస్తుంది. పాదాలు సాగేలా చేసే వ్యాయామాలు లేదా యోగా చేయాలి. దీని వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఈ తరహా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు సూచనలను పాటించడం వల్ల పాదాలు లేదా మడమల నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు.