సూర్యుడికి అతి సమీపంగా పార్కర్ ప్రోబ్.. చరిత్ర సృష్టించనున్న నాసా స్పేస్‌క్రాఫ్ట్
న్యూఢిల్లీ: నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్స్పే స్‌క్రాఫ్ట్ ఇప్పుడు చరిత్ర సృష్టించనున్నది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లనున్నది. అతిభయంకరమైన వాతావరణం, రేడియేషన్‌ను తట్టుకుని ఆ వ్యోమనౌక .. సూర్యడి సమీపానికి వెళ్తున్నది. డిసెంబర్ 24వ తేదీన సూర్యుడి బహ్యవలయమైన కరోనాకు సమీపంగా పార్కర్ ప్రోబ్ వెళ్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భగభగ మండే భానుడికి సమీపంగా ఉన్న కారణంగా.. ఆ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి కొన్ని రోజుల పాటు సిగ్నల్స్ అందవని తెలిసింది. ఒకవేళ సూర్యడి అగ్నితాపాన్ని తట్టుకుంటే, ఆ స్పేస్‌క్రాఫ్ట్ డిసెంబర్ 27వ తేదీన మళ్లీ సిగ్నల్స్ పంపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కరోనా లేయర్‌కు సమీపానికి వెళ్లడం వల్ల సూర్యుడు ఎలా పనిచేస్తాడన్న అధ్యయనాన్ని మరింత లోతుగా విశ్లేషించే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శతాబ్ధాలుగా సూర్యుడి గురించి ప్రజలు స్టడీ చేశారని, కానీ అతి సమీపం నుంచి ఆ వాతావరణాన్ని ఎవరూ అనుభవించలేదని నాసా శాస్త్రవేత్త డాక్టర్ నికోలా ఫాక్స్ తెలిపారు.
6 లక్షల 92 వేల కిలోమీటర్ల వేగంతో పార్కర్ ప్రోబ్ ప్రయాణిస్తోంది. సూర్యుడి కరోనాకు సమీపంగా వెళ్తున్న సమయంలో.. పార్కర్ ప్రోబ్ మెషిన్ సుమారు 982 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. 2018లో పార్కర్‌ను తొలిసారి ప్రయోగించారు. ఇప్పటికే ఆ స్పేస్‌క్రాఫ్ట్ 21 సార్లు సూర్యుడిని చుట్టేసింది. సుమారు 4.5 ఇంచుల కార్బన్ కంపోజిట్ షీల్డ్ ఉన్న పార్కర్ స్పేస్‌క్రాఫ్ట్.. చాలా వేగంగా కరోనాను తాకి మళ్లీ బయటి వాతావరణంలోకి రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా చాలా వేడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకు అక్కడ వాతావరణం అలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఖగోళశాస్త్రవేత్త డాక్టర్ జెన్నిఫర్ మిల్లార్డ్ తెలిపారు. సూర్యుడి కేంద్రానికి 6.1 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి పార్కర్ ప్రయాణించనున్నది.
About The Author


Related Posts

