మార్కెట్‌లో ప్రతికూల పవనాలు.. నష్టాల్లో ముగిసిన సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు ప్రారంభంలోనే నష్టాల్లో మొదలయ్యా. ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్‌ని ప్రకటించనున్నది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 82,000.31 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 82,116.44 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 81,551.28 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 384.55 పాయింట్లు పతనమై.. 81,748.57 వద్ద ముగిసింది.
నిఫ్టీ 100.05 పాయింట్లు పతనమై.. 24,668.25 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,220 షేర్లు పురోగమించగా.. 1748 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, టీసీఎస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. సెక్టార్లలో, రియల్టీ ఇండెక్స్ 3శాతం, మీడియా ఇండెక్స్ 1.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం లాభపడ్డాయి. ఐటీ, మెటల్, ఆయిల్, గ్యాస్ 0.5 నుంచి ఒకశాతం వరకు పతనమయ్యాయి.