శారీరక మానసిక వికాసానికి క్రీడలు..!
(23 జూన్ ‘అంతర్జాతీయ ఓలంపిక్ దినం’ సందర్భంగా)
23 జూన్ 1894న కెనడా, ఆస్ట్రియ, యుకె, బెల్జియమ్, గ్రీస్, పోర్చుగల్, స్విస్జర్లాండ్, ఉరూగ్వే, వెవెజులా అనబడే తొమ్మిది దేశాల ‘నేషనల్ ఓలంపిక్ కమిటీ‘ సారథ్యంలో “అంతర్జాతీయ ఓలంపిక్ దినోత్సవం” నిర్వహించడం ప్రారంభించారు. వయసు, కులమతాలు, ప్రాంతాలు, లింగ భేదాలు లేకుండా క్రీడల పట్ల ఆసక్తిని, అభిరుచుని పెంపొందించే సదుద్దేశంతో ప్రతి ఏట 23 జూన్ రోజున ప్రపంచ దేశాలన్నీ ఓలంపిక్ దినోత్సవాన్ని పాటించుట జరుగుతున్నది. ప్రతి ఒక్కరు క్రీడల ప్రాముఖ్యతను గ్రహించి శారీరక, మానసిక వికాసం కోసం దైనందిన జీవితంలో అవుట్ డోర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని చూపాలి.
క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం:
శారీరక చురుకుదనం, మానసిక ధృఢత్వం వేటలో క్రీడలకు కొంత చోటు ఇవ్వడం ద్వారా వ్యాధినిరోధకశక్తిని పోగుచేసుకోవాలి. అంతర్జాతీయ ఓలంపిక్ కమిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఓలంపిక్ దినం-2024 నినాదంగా ‘ఐక్యత మరియు నిలకడ (యునిటీ అండ్ రెసిలియెన్స్)’ అంశాన్ని తీసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. క్రీడల ద్వారా అంతర్జాతీయ సమైక్యత, మానవాళి ఏకీకరణ, శారీరక క్రియాశీలత, మానసిక పటుత్వం సాధించే వేదికల్లో క్రీడలు అతి ముఖ్యమైనవని గమనించాలి. అంతర్జాతీయ ఆధునిక ఓలంపిక్ కమిటీ తొలి అధ్యక్షుడు ‘చార్లెస్ పెరీ డి ఫ్రెడీ’ని నియమించబడడంతో ఆయనను ‘ఆధునిక ఓలంపిక్ క్రీడల పితామహుడి’గా పిలుస్తున్నాం.
ఓలంపిక్ డే రన్:
అంతర్జాతీయ క్రీడా సంబరంగా స్ఫూర్తిని కలిగించే ప్రయత్నంలో భాగంగా 23 జూన్ 1987 నుంచి 150 దేశాల జాతీయ ఓలంపిక్ కమిటీలకు చెందిన పురుష, మహిళ, పిల్లల్ని ఒక చోటికి చేర్చే వేదికగా ప్రతి ఏట అంతర్జాతీయ ఓలంపిక్ దినం సందర్భంగా ‘ఓలంపిక్ డే రన్’ నిర్వహించుట ఆనవాయితీగా వస్తున్నది. అంతర్జాతీయ ఓలంపిక్ దినం వేదికగా క్రీడా, సాంస్కృతిక వేడుకలతో పాటుగా సెమినార్లు నిర్వహించుట జరుగుతుంది. ఓలంపిక్ డే నినాదాలుగా క్రీయాశీలత (మువ్), నేర్చుకోవడం (లెర్న్), కనుగొనుట (డిస్కవరీ) అనబడే 3 ముఖ్య అంశాలు చేర్చబడ్డాయి. ‘క్రియాశీలత’లో శారీరక పటుత్వం కలుగుతుంది. ‘నేర్చుకోవడం’ అనే అంశంలో మానవీయత, అంటువ్యాధుల కట్టడి, విద్య, మానవ అక్రమ రవాణ, మహిళా సాధికారత, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన, సమాజాభివృద్ధి, స్నేహ విస్తరణ, మానవాళిని గౌరవించడం అనే భావనలు అమిడి ఉంటాయి. ‘కనుగొనడం’ అనే అంశంలో భాగంగా క్రీడావ్యాప్తికి కంకణ బద్దులు కావడం, లింగ వివక్షకు తావులేకుండా చూసుకోవడం, అన్ని వయస్సులు, వర్గాల వారిని ప్రోత్సహించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అమెరికాలో 60-65 శాతం (దాదాపు 160 మిలియన్లు) ప్రజలు స్థూలకాయ సమస్యలతో బాధ పడుతున్నారు. సబ్-సహారా ఆఫ్రికన్ ప్రాంతంలో 237 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో నరకం అనుభవిస్తున్నారు. ఓలంపిక్ డే వేదికలో క్రీడలు మాత్రమే కాకుండా సామాజికాభివృద్ధి అంశాలు కూడా చర్చించడం జరుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944లలో ఓలంపిక్ క్రీడలు నిర్వహించలేదు.
ఓలంపిక్ క్రీడల్లో భారతం:
1900 పారిస్ ఓలంపిక్స్ నుంచి ఇండియా ఓలంపిక్ క్రీడల్లో పాలుపంచుకుంటూ అథ్లెటిక్స్‌లో ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచ్ఛర్డ్ ఏసియాలోనే తెలిసారి రెండు వెండి పథకాలు గెలవడం జరిగింది. ఇప్పటి వరకు భారత క్రీడాకారులు 9 బంగారు, 7 వెండి, 12 రజత పతకాలు గెలవడం జరిగింది. 1920 నుంచి సమ్మర్ ఓలంపిక్స్, 1964 నుంచి వింటర్ ఓలంపిక్ క్రీడల్లో భారత జట్లు పాల్గొంటున్నాయి. సర్ దొరాబ్జీ టాటా చొరవతో 1923-24లో ఏర్పడిన ఇండియన్ ఓలంపిక్ కమిటీ నేతృత్వంలో 140 కోట్లకు పైగా దేశ జనాభా కలిగి ఉన్నప్పటికీ గత శతాబ్దకాలంలో 35 ఓలంపిక్ పతకాలు మాత్రమే గెలవడం అత్యంత విచారకరం. అదే క్రమంలో 33.3 కోట్ల జనాభా మాత్రమే కలిగిన అమెరికా 2,633 ఓలంపిక్ పతకాలు గెలుపొందడం గమనించాలి. 2048లో భారతదేశం ఓలంపిక్, పారా ఓలంపిక్ క్రీడలు నిర్వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ, తన గట్టి ప్రయత్నాలను ప్రారంభించింది.
ఇండియన్ ఓలంపిక్ అసోసియేషన్:
మన దేశంలో 34 రాష్ట్ర ఓలంపిక్ సంఘాలు, రైల్వే, సర్వీసెస్ స్పోర్టస్ కంట్రోల్ బోర్డులు ఉన్నాయి. ప్రస్తుతం 38 జాతీయ క్రీడా ఫెడరేషన్లు సభ్యులుగా ఇండియన్ ఓలంపిక్ అసోసియేషన్ పని చేస్తున్నది. రాష్ట్ర ఓలంపిక్ అసోసియేషన్ పరిధిలో జిల్లా ఓలంపిక్ అసోసియేషన్లు చురుకైన బాధ్యతలు నిర్వహిస్కున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వసతుల లేమి, మౌళిక వనరుల కొరత, ప్రోత్సాహం కొరవడడం, మితిమీరిన రాజకీయ జోక్యం లాంటి కారణాలతో ఓలంపిక్స్‌లో పూర్తి జట్లు పాల్గొంటున్నప్పటికీ పతకాల పంట పండకపోవడం అత్యంత బాధాకరం.
ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తి కలిగిన “యంగ్ ఇండియా”లో యువత క్రీడల పట్ల ఆసక్తి కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుందాం. ఈ లక్ష్యంతో ఇండియన్ ఓలంపిక్ అసోసియోషన్ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తూ, భారతదేశ కీర్తిని క్రీడా వేదికల మీద ఇనుమడింపజేయాలని కోరుకుందాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు
కరీంనగర్ - 9949700037