సినిమాలు మానేస్తానంటున్న సుకుమార్.. వీడియో
పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశాడు దర్శకుడు సుకుమార్. దంగల్, బాహుబలి చిత్రాల తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఈ సినిమా నిలవడంతో పాటు హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు పుష్ప 2 పరుగులు పెడుతుంది. అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధించిన సందర్భంలో సుకుమార్ తాను సినిమాలు వదిలేస్తా అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రామ్ చరణ్‌తో పాటు శంకర్, దిల్ రాజు, సుకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో భాగంగా.. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చాడు సుక్కు. సుకుమార్ గారూ మీరు ఈరోజుతో ఏదైనా ఒకటి వదిలేయాలనుకుంటే ఏం వదిలేస్తారు అంటూ యాంకర్ సుమ అడిగింది. దీనికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమాలు అంటూ సమాధానమిస్తాడు. దీంతో సుమతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే సుకుమార్ ఇలా చెప్పిన అనంతరం రామ్ చరణ్ మైక్ తీసుకొని 10 ఏళ్లుగా ఇలానే భయపెట్టిస్తున్నారండి.. అలా ఏం జరగదు అంటూ అన్నారు. దీనికి సుకుమార్ నవ్వి ఊరుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.