హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు బన్నీ. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ఈ విషయమై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సరైంది కాదన్నాడు సుమన్. థియేటర్ వాళ్లే హీరోలను పిలుస్తుంటారు. తనను కూడా అప్పట్లో పిలిచేవారని.. తాము ఎప్పుడొస్తారో చెబితే థియేటర్ వాళ్లు ఏర్పాట్లు చేస్తామంటారన్నాడు. హీరో వచ్చినప్పుడు అతడితోపాటు జనాల రద్దీని నియంత్రించే బాధ్యతంతా కూడా థియేటర్ యాజమాన్యానిదేనన్నాడు.
హీరోను ఇలా అరెస్ట్ చేయడం తప్పన్న సుమన్.. ఏదేమైనా జరిగిన ఘటనను మార్చలేం. కానీ ఇక ముందు హీరోలకు హెచ్చరిక.. హీరోలు అలా వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చూశాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రస్తుతానికి తాను కలవలేక పోతున్నానంటూ.. త్వరలో వారి కుటుంబాన్ని కలుస్తానని ఇప్పటికే ఎక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్.