సర్వే పేరుతో ఆశపెట్టి.నిబంధనల పేరుతో నీళ్లుచల్లోద్దు.
కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి
రామవరం వాసులు అర్హులు కానప్పుడు సర్వే ఎందుకు ?
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో మభ్యపెడుతున్న ప్రభుత్వం
ప్రభుత్వ నిబంధనలతో 3వేల మందికి పైగా పేదల ఆశలపై నీళ్లు.
రామవరం వాసులకు స్పష్టమైన హామీ ఇచ్చాకే సర్వే చేయాలి
కొత్తవి ఇచ్చేది లేదు ఉన్నవి అమలు చేసేది లేదన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిబంధనల సవరించి ప్రభుత్వం రామవరం ప్రజల సమస్య పరిష్కరించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 16.
కొత్తగూడెం సర్వే పేరుతో ఆశపెట్టి నిబంధనల పేరుతో నిరుపేదల సొంతింటి ఆశలపై నీళ్లుచల్లోద్దని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో ప్రభుత్వం పేద ప్రజలను మభ్యపెడుతోందని, 1/70లో ఉన్న రామవరం ప్రాంత వాసులు అర్హులు కానప్పుడు సర్వే ఎందుకు ? చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 3వేల మందికి పైగా పేదల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని, రామవరం వాసులకు స్పష్టమైన హామీ ఇచ్చాకే సర్వే చేయాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశారని, కానీ ప్రస్తుతం కొత్తవి ఇచ్చేది లేదు.ఉన్నవి అమలు చేసేది లేదన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొనసాగుతోందని, నిబంధనల విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ ప్రాంత వాసుల సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వర్తించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకు కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి 14,377 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, రామవరం పరిధిలో ఉన్న ఏడు వార్డులో దాదాపు 3,200 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. రామవరం ప్రాంత వాసులకు కేవలం కరెంటు బిల్లు, మున్సిపాలిటీ పన్ను చెల్లించే రశీదులు తప్ప ఎలాంటి హక్కు పత్రాలు లేవని, ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో డీ ఫాం పట్టా, సాదా సేల్, రిజిస్ట్రర్డ్ సేల్ డీడ్, జీవో నెం.58, పొజిషన్ సర్టిఫికెట్, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ వంటివి అధికారులు అడుగుతున్నారని, రామవరం వాసులకు ఇవేవీ లేవని, అనవరసంగా ఈ ప్రాంతంలో సర్వే చేసి నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లినట్టేనని తెలిపారు. గతంలో రామవరంలో దాదాపు 1800 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, అప్పుడన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లేని నిబంధనలు ఇప్పుడన్న ప్రభుత్వానికి ఎందుకు అడ్డొస్తున్నాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప ఫలితం లేదని, ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని గంపెడాశలతో ఉన్నారని, ప్రభుత్వం మాత్రం నిబంధనలతో వారిని మానసికంగా వేధింపులకు మనోవేదనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని, దీంతో పాటు 75 గజాల స్థలం పొందిన కొత్తగూడెం వాసులకు ఆ స్థలంలో ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. రామవరం వాసుల చిరకాల కోరికైన ఇండ్ల పట్టాలను మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా రామవరం ప్రాంత వాసుల సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చాకే అధికారులు సర్వే చేపట్టాలని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు అయ్యేలా చూడాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు.