యువ భారతానికే శాపం పోటీ పరీక్ష పేపర్‌ లీకుల బాగోతం!

తాజాగా ఎన్‌టిఏ నిర్వహించిన “యుజీసీ నెట్‌ పరీక్ష” రద్దు వార్తకు స్పందనగా

యువ భారతానికే శాపం పోటీ పరీక్ష పేపర్‌ లీకుల బాగోతం!

    భారతం యువశక్తితో నిండి ఉంది. దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్నది. యువత కంటున్న పెద్ద పెద్ద స్వప్నాలను సాకారం చేసుకోవడానికి విద్యనభ్యసించడం, పలు పోటీ పరీక్షలు రాయడం ద్వారా ఉద్యోగాలు, కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి నిరంతరం ఇష్టంగా కష్టపడి చదువుతున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ, ఎన్‌టిఏ‌ పరీక్షతో మొదలు పాఠశాల బోర్డులు నిర్వహించే వార్షిక పరీక్షల వరకు భారతంలో పేపరు లీకులు సర్వసాధారణం అయ్యాయి. తాజాగా నీట్‌ పరీక్ష పేపరు లీకు సమస్య సమసిపోక ముందే నేడు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ-నెట్‌ పరీక్షలో బయట పడిన అవకతవకలను పరిగణనలోకి తీసుకొని ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యావేత్తలు, పరీక్ష రాసిన అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. దేశవ్యాప్తంగా 18 జూన్‌ 2024 మంగళవారం రోజున 83 సబ్జెక్టుల్లో 317 నగరాల్లో 1205 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 11.21 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు, కళాశాలల్లో అడ్మిషన్ల కోసం వేచి చూస్తున్న అర్హతలు కలిగిన యువతకు పేపర్‌ లీకులు శాపంగా మారుతున్నాయి. ఇటీవల నీట్‌-2024 పరీక్ష నిర్వహణ తర్వాత తలెత్తిన లీకేజీ అంశం కూడా “టాక్ ఆఫ్‌ ది నేషన్”‌ అయ్యింది. 05 మే రోజున నిర్వహించిన నీట్‌-2024 పరీక్షలు 571 నగరాలకు చెందిన 4,750 కేంద్రాల్లో (14 విదేశీ కేంద్రాల్లో) పరీక్షలు జరిగాయి. కొన్ని సెంటర్లలో కొంత మంది యువతకు పేపర్లు పొరపాటుగా పంపిణీ జరిగినట్లు నిర్వహకులు తెలుపడం విన్నాం.  గత ఏడేళ్లలో భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో 70 పరీక్షల పేపర్లు లీకు కావడంతో 1.5 కోట్ల యువత భవిష్యత్తు అంధకారంలో పడిందని అంచనా వేస్తున్నారు. ఇటీవల “నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఏ)” నిర్వహించిన ఎంబిబిఎస్‌ మెడికల్‌ ఎంట్రెన్స్ అయిన‌ నీట్‌-యూజీ 2024 (నేషనల్‌ ఎంట్రెన్స్‌ - కమ్‌ - ఎలిజిబులిటీ టెస్ట్‌) పరీక్ష పేపరు లీకు అయ్యిందంటూ, వివాదాస్పద గ్రేస్‌ మార్కుల విధాన వార్తలు వెల్లువెత్తడంతో పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోను కావడం చూస్తున్నాం. ఈ అంశం సుప్రీంకోర్టు కోర్టు వెకేషన్‌ బెంచ్ వరకు చేరడంతో పరీక్ష ఫలితాల విషయంతో పాటు అభ్యర్థుల భవిత గాల్లో దీపం అయ్యింది. 

పోటీ పరీక్షల లీకుల చరిత్ర:
        ఇటీవల తెలంగాణ రాష్ట్ర టిఎస్‌పిఎస్‌సి  నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పేపరుతో పాటు ఏఈఈ ఉద్యోగ నియామకాల పరీక్ష పేపరు కూడా లీగ్‌కు కావడం, గ్రూపు-1 పరీక్ష రద్దు చేయడం జరిగింది. సువిశాల భారతంలో నిత్య ఏదో ఒక మూల నుండి పరీక్ష పేపర్లు లీక్ కావడంతో పరీక్షలు రద్దు కావడం, మరో సారి పరీక్షలను నిర్వహించడం అనే వార్తలు అనాదిగా సాధారణ వార్తలుగా వినిపిస్తూనే ఉన్నాయి. మీడియా విశ్లేషణల ప్రకారం గత ఏడేళ్లలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన 70 వరకు పరీక్ష పేపర్లు లీకు కావడంతో దాదాపు 1.5 కోట్ల యువత ప్రభావితం అయ్యారని తెలుస్తున్నది. అదే విధంగా గత ఐదేళ్లలో 15 రాష్ట్రాల 41 పోటీ పరీక్ష పేపర్లు లీకుకావడంతో ఒక లక్ష ఉద్యోగాలకు వేచి ఉన్న 1.4 కోట్ల యువత నిరాశపాలైనారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో 2017 నుంచి నేటి వరకు నిర్వహించే పోటీ పరీక్షలు లీకుల స్కాములతో కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా యూపీ, బీహార్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్,‌ యంపీ లాంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన పరీక్షల పేపర్లు లీకు కావడం సర్వసాధారణం అయ్యింది. పేపర్లు లీకు కావడంతో యువత మానసిక ఒత్తిడికి గురి కావడం, వెచ్చించిన సమయం/చేసిన కృషి వృధా కావడం, భవిష్యత్తు కలలు విచ్చిన్నం కావడం, యువత ఏకాగ్రత సడలడం, పరీక్షల మీద నమ్మకం సన్నగిల్లడం, తిరిగి పరీక్షలకు తయారు కావడం, తల్లితండ్రులు ఒత్తిడి బారిన పడడం, పేద యువతకు ఆర్థిక భారం పడడం, ప్రభుత్వ పరీక్ష నిర్వహణ వ్యవస్థల మీద చులకన భావం ఏర్పడడం లాంటి దుష్ఫలితాలు కలుగుతున్నాయి. 

పరీక్ష పేపర్‌ లీగులను కట్టడి చేసే చట్టాలు:
         వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పేపరు లీకుల నిరోధానికి పలు చట్టాలను చేసినప్పటికీ పేపరు లీకులు, చీటింగ్‌ కేసులు ఆగడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) ఆక్ట్‌, 2024’ను తీసుకురావడం చూసాం. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్ష పేపరు లీకులు రుజువైన వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. చట్టాలు ఎన్ని చేసినప్పటికీ లీకులు మాత్రం ఆగడం లేదు. పరీక్షల నిర్వహణకు యూపిఎస్సీ లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏర్పాటు కావాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వాల పాత్రకు దూరంగా పరీక్షలు నిర్వహించే ప్రత్యేక సంస్థలు ఏర్పాటు, పేపర్‌ నిర్వహణలో ఆధునిక ఐటీ ప్రయోజనాలను వాడుకోవడం, ఆన్‌లైన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, పలు సెట్ల పేపర్లు తయారు చేయించడం, లీకు వీరులను సత్వరమే శిక్షించే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడం జరగాలి. కోచింగ్‌ సెంటర్ల ప్రమేయంతో పేపరు లీకైనపుడు ఆ సంస్థలను వెంటనే మూసి వేయడం జరగాలి. పరీక్ష పేపర్ల తయారీ నుండి మొదలుకొని పేపర్‌ ప్రింటింగ్‌, పరీక్షా కేంద్రాల వరకు పంపిణీ, పరీక్ష నిర్వహణ కేంద్రం అనే చైన్‌లో అనాయాస డబ్బు దురాశతో వ్యక్తులు దుర్భుద్ధితో ప్రతి దశలో పరీక్ష పేపర్లు లీకు చేయడానికి వెనుకబడడం లేదని గత చరిత్ర రుజువు చేస్తున్నది.
        పోటీ పరీక్షల పేపర్లు లీకు కావడంతో తిరిగి పరీక్షలు నిర్వహించడం, పరీక్ష నిర్వహణ వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లిన యువత పరీక్షలకు పూర్తి స్థాయిలో తయారు కాకపోవడంతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇలాంటి పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఇతర దేశాల పరీక్షా నిర్వహణ వ్యవస్థలను అధ్యయనం చేస్తూ మన పరీక్షల నిర్వహణను గాడిలో పెట్టి, యువతకు సకాలంలో ఉద్యోగాలు, కోర్సుల్లో చేరడానికి ద్వారాలు తెరవాలి. బీహార్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ కేంద్రాల్లో బయట పడిన నీట్‌ యూజీ -2024 పరీక్ష పేపర్‌ లీకులతో పాటు యుజీసీ నేట్‌-2025 పరీక్ష రద్దు విషయాలను తీవ్రంగా తీసుకొని అపరాధం చేసిన ముఠా గుట్టు రట్టు చేసిన వెంటనే జైలు శిక్ష అమలు చేసి, విద్యార్థుల ప్రతిభకు సత్వరమే న్యాయం జరిగే విధం తగు నిర్ణయాలను తీసుకోవాలని పౌర సమాజం కోరుకుంటున్నది. 

8f401886-0154-4f4f-a95a-0b68028614a7

               డా: బుర్ర మధుసూదన్ రెడ్డి 
            కాలమిస్ట్‌ - కీర్తి పురస్కార గ్రహీత
                       9949700037

 

Views: 85

About The Author

CHIFF EDITOR  Picture

D.VENKATESH  PHONE NUMBER : 9490817191

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక