మాజీ ఎమ్మెల్యే కృషితోనే గ్రామపంచాయతీగా గర్రెపల్లె.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి.
హుస్నాబాద్ ఆర్సి ఇంచార్జ్ కొత్తపెళ్లి అనిల్ చారి: (అక్షర గెలుపు)
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు కృషితోనే సోమరం గ్రామపంచాయతీ పరిధిలోగల గర్రెపల్లి గ్రామపంచాయతీగా ఏర్పడబోతుందని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాలుగా తమ గ్రామము అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతుండేదని అన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని అన్నారు. కొద్దిపాటి వర్షానికే నీరు అంతా చేరి గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవని పేర్కొన్నారు. తమ గ్రామము ఇతర గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండడంతో గ్రామంలో అభివృద్ధి పనులకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో గ్రామస్తులతో సమావేశము ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరించానని పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారంతో ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నామని పేర్కొన్నారు. 2014వ సంవత్సరం నుంచి గ్రామపంచాయతీ ఏర్పాటు కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అప్పటి ఎంపీలు ఒడితల లక్ష్మీ కాంతారావు, బోయినపల్లి వినోద్ కుమార్, అప్పటి ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబును పలు మార్లు కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను గురించి వివరించడం జరిగిందన్నారు. అప్పుడు ఎమ్మెల్యే వెంటనే స్పందించి తాగునీటి సౌకర్యంతో పాటు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేలా అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారన్నారు. ఎల్లమ్మ గుడి నుంచి గర్రెపల్లె మీదుగా సైదాపూర్ రోడ్డు వరకు రోడ్డు మంజూరు చేయించి నిధులు తెప్పించారన్నారు. ప్రస్తుతం గ్రామంలో రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పాయన్నారు. గ్రామ పంచాయతీగా ఏర్పడితే మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో లక్ష్మీ కాంతారావు, వినోద్ కుమార్, ఒడితల సతీష్ బాబు కు విన్నవించామన్నారు. సతీష్ బాబు వెంటనే అధినేత కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త పంచాయతీ ఏర్పాటుకు దోహదం చేశారన్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, అంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడం కారణంగా ప్రకటన వెలువడటంలో కొంత జాప్యం ఏర్పడిందన్నారు. తాజాగా గవర్నర్ ఆ ఫైల్ ను ఆమోదించడంతో గర్రెపల్లి కొత్త పంచాయతీగా ఏర్పాటుకు మార్గం సుగమయింది అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు కృషితోనే గర్రెపల్లి గ్రామ పంచాయతీగా ఆవిర్భవించబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున ఆయన సతీష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ ఏర్పాటుకు సహకరించిన స్థానిక నాయకులు, గ్రామస్తుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఏర్పాటుతోపాటు గ్రామ అభివృద్ధి కోసం నాటి నుంచి నేటి వరకు పోరాడుతున్న తాను గ్రామస్తుల సహకారంతో ఇక ముందు కూడా గ్రామాభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.